Thursday, August 11, 2011

   **** పేరిశెట్టి శ్రీనివాసరావు****
****హిందీ :రాంస్వరూప్‌ దీక్షిత్‌****
నువ్వెళ్ళిపోయిన తర్వాతే
తెలుసుకున్నాను నేను
ఎందుకంటే నువ్వున్నప్పుడే
ఇల్లు 'ఇల్లు'లా ఉండేది
నువ్వెళ్ళిపోయిన తర్వాత
అప్పటి వరకు ఇల్లుగా ఉన్న ఇల్లు
అకస్మాత్తుగా
నివాసంలా మారిపోయింది!



ఇంట్లోని వస్తువులన్నీ
నువ్వున్నప్పుడు
మాట్లాడుతుండేవి, పలుకరిస్తుండేవి
అవిప్పుడు నిర్జీవమయిపోయాయి
ఎందుకంటే
ప్రతి వస్తువులోను నీవే నిండి ఉన్నావు



నువ్వున్నప్పుడు
వేల మైళ్ళ దూరం నుండి
నన్ను రారమ్మని పిలుస్తుండేది ఇల్లు
కొన్ని రోజుల వరకు
వెళ్ళనిచ్చేది కాదు బయటికి నన్ను



అదే ఇల్లు
ఇప్పుడు
లోపల ఉంటున్నా
ఉండనివ్వడం లేదు
నేను అందులోని
ఎన్నో వస్తువుల్లో
ఒక దానిలాగ నివసిస్తున్నాను...



ఇప్పుడే తెలిసింది నాకు
గృహస్థులు అయ్యుండి
గృహం లేని వారవుతారు
గృహం లేనివారు
నిండైన గూడు కట్టుకుంటున్నారు
చెట్లకింద, వంతెనల కింద
ఫుట్‌పాత్‌ల పైన
ఆకాశం క్రింద కూడా!

1 comment: